జీహెచ్ఎంసి అభివృద్ధి 2020 లో చేసిన పనులు- Report

0
76
జీహెచ్ఎంసి అభివృద్ధి 2020 లో చేసిన పనులు చూసుకుంటే కరోనా కల్లోలంలోనూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం, ఎస్.ఆర్.డి.పి పనులను వేగవంతం చేయడం, నగరానికే నగీషీగా ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, థీమ్ పార్కుల నిర్మాణం, నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్, మున్సిపల్ వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ప్రారంభం, బల్దియా ఆస్తుల పరిరక్షణ సెల్ ఏర్పాటు, మున్సిపల్ వ్యర్థాల రవాణకు ఆధునిక వాహనాలను సమకూర్చుకోవడం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం తదితర ఎన్నో వినూత్న విజయాలను 2020 సంవత్సరంలో జీహెచ్ఎంసీ తన ఖాతాలో వేసుకుంది.
జీహెచ్ఎంసి అభివృద్ధి
విజయవంతంగా ఎన్నికల నిర్వహణ

డిసెంబర్ మొదటి వారంలో 150 వార్డులకు జరిగిన ఎన్నికలను అతితక్కువ సమయం ఉన్నప్పటికీ విజయవంతంగా నిర్వహించింది. సుధీర్ఘ కాలం అనంతరం బ్యాలెట్ బాక్స్ ద్వారా నిర్వహించిన ఈ ఎన్నికలలో దాదాపు 36 మంది సిబ్బంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. కోవిడ్-19 నియమ నిబంధనలు పక్కాగా పాటించడంతో ఏవిధమైన సంఘటనలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది.

లాక్ డౌన్

ప్రపంచాన్ని గడగడావనికించిన కోవిడ్-19 మహమ్మారి సందర్భంగా విధించిన లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేయడంలో జిహెచ్ఎంసి విజయం సాధించింది. ఈ లాక్ డౌన్ పిరియడ్ లో నగరంలోని సామాన్య ప్రజానికానికి ఏమాత్రం ఇబ్బంది రాకుండా కోవిడ్-19 ను అరికట్టడంలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఉన్న జిహెచ్ఎంసి శానిటేషన్ వర్కర్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిహెచ్ఎంసి కార్మికులకు శానిటైజర్, మాస్కులు, గ్లౌజ్ లు ఇతర పరికరాలు అందించడంతో పాటు నగరంలో ప్రతిరోజు రెండు పూటల 50వేల మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించింది. నిరాశ్రయులకు 19 షెల్టర్ల ద్వారా ఆశ్రయం కల్పించింది.

రియల్ ఎస్టేట్ పురోగతి

ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం అనంతరం గ్రేటర్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం గణనీయ పురోగతిలో ఉంది. 2010 నుండి 2014 వరకు జిహెచ్ఎంసి పరిధిలో 733 కమర్షియల్ ప్రాజెక్ట్ ల ద్వారా 5,72,00,657 ఎస్.ఎఫ్.టి ల అనుమతులు జారీ కాగా, 2015 నుండి 2019 వరకు 917 ప్రాజెక్ట్ లకు 10,43,55,005 ఎస్.ఎఫ్.టి ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. 2015 నుండి 2019 దాక 11,024 గృహ నిర్మాణ ప్రాజెక్ట్ లకు అనుమతులు జారీచేశారు. ఇదే కాలంలో 65,953 భవన నిర్మాణ అనుమతులను జారీచేశారు. జిహెచ్ఎంసి పరిధిలో అమలు చేస్తున్న డి.పి.ఎం.ఎస్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ప్రశంసలను అందజేసింది.

ఎస్.ఆర్.డి.పి కార్యక్రమాలు

వ్యూహాత్మక రోడ్ల జీహెచ్ఎంసి అభివృద్ధి కార్యక్రమం మొదటి దశలో భాగంగా 26 ప్రధాన రోడ్లను విస్తరించి ఆయా మార్గాల్లో మల్టీలేవల్ ఫ్లైఓవర్లు, ప్రధాన జంక్షన్ల అభివృద్ది చేసి సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ కు బాటలు వేసింది. దీనిలో భాగంగా 7 స్కై వే లు, 11 మేజర్ కారిడార్ లు, 68 మేజర్ రోడ్స్, 54 గ్రేడ్ సపరేటర్లను చేపట్టింది. వీటిలో రూ. 1010.77 కోట్ల వ్యయంతో 9 ఫ్లైఓవర్లు, నాలుగు అండర్ పాస్ లు, మూడు ఆర్.ఓ.బి/ ఆర్.యు.బి, ఒక కేబుల్ బ్రిడ్జి నిర్మాణాలను పూర్తిచేశారు. రూ. 4741.97 కోట్ల వ్యయంతో మరో 20 అభివృద్ది పనులు పురోగతిలో ఉన్నాయి. రూ. 2310 కోట్ల వ్యయంతో ఐదు ప్రాజెక్ట్ ల డి.పి.ఆర్ లు సిద్దంగా ఉన్నాయి. రోడ్ నెం-45 జూబ్లీహిల్స్, ఎల్బీనగర్ జంక్షన్, నాగోల్ జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్లకు భూసేకరణ జరిపి వీటి నిర్మాణాలను 2020 లో పూర్తిచేసింది. వీటితో పాటు అంబర్ పేట్, బాలానగర్, ఉప్పల్ రహదారుల విస్తరణను రోడ్లు, భవనాల శాఖ, హెచ్.ఎం.డి.ఏ లతో కలిసి చేపట్టింది.

సూపర్ స్టార్ రజనీకాంత్‌ అధిక రక్తపోటుతో అపోలో ఆస్పత్రిలో చేరిక- Tense

లింక్ రోడ్ల నిర్మాణం

జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ప్రదాన రహదారులకు కనెక్టివిటీ పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్దికి గాను మిస్సింగ్ లింక్ రోడ్లను చేపట్టింది. మొదటి దశలో భాగంగా 37 మిస్సింగ్ రోడ్లను గుర్తించి వీటికి సంబంధించిన భూ సేకరణ, ఆస్తుల సేకరణను పూర్తిచేసి ఈ రోడ్ల నిర్మాణాలను చేపట్టింది.వారసత్వ కట్టడాల పునరుద్దరణ, పరిరక్షణలో భాగంగా రూ. 12 కోట్ల వ్యయంతో ఎం.జె మార్కెట్ పునరుద్దరణ పనులను పూర్తిచేసింది. ఎం.జె మార్కెట్ లో స్టేర్ కేస్, సజ్జలు, డోమ్ లు, డక్టింగ్, సీలింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, లైటింగ్, ఫ్లోరింగ్ తదితర పనులను పూర్తిచేశారు.చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ లో భాగంగా హైదరాబాద్ లోని చార్మినార్ ను స్వచ్ఛ భారత్ మిషన్ ప్రత్యేక స్వచ్ఛ ఐకానిక్ కట్టడం గా ప్రకటించింది. దీనిలో భాగంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో త్రాగునీరు, శానిటేషన్ తదితర కార్యక్రమాలను పూర్తిచేశారు.

వెటర్నరీ విభాగంలో వినూత్న కార్యక్రమాలు

అంతర్జాతీయ ప్రమాణాలతో రూ. 1.10 కోట్ల వ్యయంతో దేశంలోనే మొట్టమొదటి డాగ్ పార్క్ ను శేరిలింగంపల్లి జోన్ లోని కొండాపూర్ లో 1.30 ఎకరాల విస్తీర్ణంలో జిహెచ్ఎంసి నిర్మించింది. రోడ్డు ప్రమాదాలకు తావులేకుండా తమ పెంపుడు శునకాలను బహిరంగ ప్రదేశాల్లో వ్యాయమం చేయించడానికి సీనియర్ సిటీజన్లకు ఈ డాగ్ పార్కు అనుకూలంగా ఉంది. వీధి శునకాల జననాలను నియంత్రించడం, రేబిస్ వ్యాధి అరికట్టేందుకై జిహెచ్ఎంసి చేపట్టిన ఎనిమల్ బర్త్ కంట్రోల్, యాంటీ రేబిస్ కార్యక్రమం లో భాగంగా హైదరాబాద్ లో 5 ప్రత్యేక ఎనిమల్ కేర్ సెంటర్లను నిర్వహిస్తోంది. ఫతుల్లాగూడ, చుడీబజార్, పటేల్ నగర్, కె.పి.హెచ్.బి కాలనీ, మహదేవ్ నగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన ఈ ఎనిమల్ కేర్ సెంటర్లలో ఎనిమల్ బర్త్ కంట్రోల్, యాంటీ రేబిస్ చేపట్టేందుకు వీధి శునకాలు, కోతులను తెచ్చేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు.

మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు

టాయిలెట్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా నగరంలో మొట్టమొదటి సారిగా మూడు మొబైల్ టాయిలెట్లను జిహెచ్ఎంసి ప్రారంభించింది. ఒక్కో మొబైల్ టాయిలెట్ లో మూడు మహిళలకు, మూడు పురుషులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ టాయిలెట్ల నిర్వహణకు రెవెన్యూ సమకూర్చుకునేందుకు వీటికి కమర్షియల్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. సుచిత్ర జంక్షన్, మూసాపేట్, కూకట్ పల్లి సర్కిళ్లలో ఏర్పాటు చేశారు. ప్రతి జోన్ కు ఐదు మొబైల్ టాయిలెట్ల చొప్పున జిహెచ్ఎంసి పరిధిలో 30 మొబైల్ టాయిలెట్లను రూ. 1.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు గాను ఆర్టీసి నుండి 30 బస్సులను సేకరించింది.

సమగ్ర రోడ్డు నిర్వహణ ప్రాజెక్ట్ (సి.ఆర్.ఎం.పి)

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రధాన రహదారులను కాంట్రాక్టర్ల ద్వారా నిర్వహించేందుకు సమగ్ర రోడ్డు నిర్వహణ ప్రాజెక్ట్ జిహెచ్ఎంసి చేపట్టింది. జిహెచ్ఎంసి పర్యవేక్షణలో జరిగే ఈ సి.ఆర్.ఎం.పి పనులను ఏడు ప్యాకేజిలుగా విభజించి రూ. 1839 కోట్ల వ్యయంతో 709.49 కిలోమీటర్ల రహదారులను ఐదేళ్ల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వుల జారీచేసింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 300 కిలోమీటర్ల (1200 లేన్ కిలోమీటర్స్) పొడవు గల రహదారులను రూ. 384 కోట్ల వ్యయంతో రీకార్పెటింగ్, ఫుట్ పాత్ ల నిర్వహణ, లేన్ మార్కింగ్, స్వీపింగ్, గ్రీనరీ నిర్వహణ తదితర పనులను ఏజెన్సీలు చేపట్టాయి.

కోవిడ్-19 మహమ్మారితో దేశవ్యాప్త లాక్ డౌన్ ఉన్నప్పటికీ 2020 మార్చి 21వ తేదీ నుండి 2020 ఏప్రిల్ 31వ తేదీ వరకు నగరంలోని ప్రధాన రోడ్ల రీకార్పెటింగ్ పనులను విజయవంతంగా జిహెచ్ఎంసి చేపట్టింది. ఈ సమయంలో దాదాపు 250 కిలోమీటర్ల (వెయ్యి లేన్ కిలోమీటర్లు) బి.టి రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు.

కొత్త కరోనా స్ట్రైన్ 70శాతం వేగంగా విస్తరిస్తుంది … మార్పుచెందడం అంటే ? Strange

దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం

ఎస్.ఆర్.డి.పి లో భాగంగా దుర్గం చెరువుపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్పాన్, కాంక్రీట్ ఎక్ట్స్ట్రా డోస్డ్ కేబుల్ బ్రిడ్జిను రూ. 184 కోట్ల వ్యయంతో జిహెచ్ఎంసి నిర్మించింది. 735.639 మీటర్ల పొడవు గల ఈ బ్రిడ్జి నిర్మాణంతో హైటెక్ సిటీ నుండి ఫైనాన్షియల్ డిస్టిక్ట్ తో పాటు నగరంలోని ఇతర ప్రాంతాలకు సులభంగా రవాణా సౌకర్యం ఏర్పడింది. ముఖ్యంగా మాదాపూర్ రోడ్, జూబ్లీహిల్స్, రోడ్ నెం.36 లలో ట్రాఫిక్ గణనీయంగా తగ్గింది. నగరానికే మకుటాయమనంగా నిలిచిన ఈ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి నగర పర్యాటక రంగానికి మరో ఆకర్షణగా నిలిచింది.

జంక్షన్ల అభివృద్ది: నగరంలోని ప్రధాన జంక్షన్లు, మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ కల్పించడం, జంక్షన్ల సుందరీకరణ, రోడ్ల విస్తరణ చేసేందుకు గాను నగరంలోని 16 ప్రధాన జంక్షన్ల అభివృద్దిని చేపట్టింది. వీటిలో అశోక్ నగర్ జంక్షన్, పురానాపూల్, రాజీవ్ గాంధీ స్టాచు జంక్షన్, రామంతపూర్ టీ జంక్షన్, కవాడిగూడ ఖానామెట్ జంక్షన్, సుచిత్ర, ఐ.డి.పి.ఎల్, లిబర్టీ, ఐ-మ్యాక్స్, నేరేడ్ మెట్, మియాపూర్, ఎల్బీనగర్, ఏ.ఎస్.రావు నగర్, ఉప్పల్, ఆలీకేఫ్, ప్రాగాటూల్స్, బోరబండ బస్టాప్ జంక్షన్లను అభివృద్ది చేశారు.

డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం: నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ సంకల్పంతో గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో 111 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్ రూం ల నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఇప్పటికే సింగం చెరువు తండా, సయ్యద్ సాబ్ కా బాడా, కిడికి బూద్ ఎలిసా, చిత్తారమ్మ బస్తీ, ఎరుకల నాంచారమ్మ బస్తీ, వనస్థలిపురం రైతు బజార్ లలోని డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు.

మోడల్ గ్రేవ్ యార్డ్ ల నిర్మాణం: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని వర్గాల వారికి ఉపయోగపడే శ్మశానవాటికలన్నింటిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రతి శ్మశాన వాటికను మోడల్ గ్రేవ్ యార్డ్ గా నిర్మించాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ సంకల్పం మేరకు నగరంలో 31 శ్మశానవాటికలను రూ. 42.66 కోట్ల వ్యయంతో అభివృద్ది చేశారు. జూబ్లీహిల్స్ లో ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో నిర్మించిన మహాప్రస్థానం మాదిరిగానే ఈ శ్మశానవాటికలన్నింటిలో ఆధునిక పద్దతిలో భర్నింగ్ ఫ్లాట్ ఫాం లు, అస్థికల భద్రతా గదులు, పార్కింగ్, స్నాన గదులు, విద్యుదీకరణ, చెట్ల పెంపకం, ల్యాండ్ స్కేపింగ్, ప్రార్థన గదులు నిర్మించారు. ఈ 31 శ్మశానవాటికల్లో 25 పనులు పూర్తి కాగా మరో 5 గ్రేవ్ యార్డ్ ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.

మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం: గ్రేటర్ హైదరాబాద్ లో బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలు కూడా ఉన్నత ప్రమాణాలు కలిగిన ఫంక్షన్ హాళ్లలో వివాహాలు, ఇతర కార్యాలు నిర్వహించేందుకు గాను జిహెచ్ఎంసి పరిధిలో రూ. 34 కోట్ల వ్యయంతో 14 మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో ఇప్పటికే రూ. 14.30 కోట్ల వ్యయంతో ఐదు ఫంక్షన్ హాళ్ల నిర్మాణం పూర్తై నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. మరో ఐదు ఫంక్షన్ హాళ్ల నిర్మాణం రెండు నెలల్లో పూర్తి కానున్నాయి. మిగిలిన నాలుగు వివిధ స్థాయిలో ఉన్నాయి. పూర్తైనవాటిలో బన్సిలాల్ పేట్, పటాన్ చెరువులోని చైతన్య నగర్, సీతాఫల్ మండి, మారేడ్ పల్లిలోని నెహ్రూనగర్, ఎల్బీనగర్ లోని గాంధీ విగ్రహం వద్ద మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం పూర్తయ్యాయి.

పురాతత్వ కట్టడాలకు మహర్దశ: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు గాను పురాతన వారసత్వ కట్టడాల పునరుద్దరణ, సుందరీకరణ పనులను జిహెచ్ఎంసి పెద్ద ఎత్తున చేపట్టింది. దీనిలో భాగంగా చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ తో సహా ఎనిమిది వారసత్వ కట్టడాలను రూ. 56.67 కోట్ల వ్యయంతో పునరుద్దరణ, సుందరీకరణ పనులను చేపట్టారు. చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ కు రూ. 51 కోట్ల వ్యయంతో ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం, చార్మినార్ చుట్టూ పర్యావరణ పరిరక్షణ చర్యలు, పర్యాటకులను ఆకర్షించే చర్యలు తదితర పనులను చేపట్టారు. దీంతో పాటు నగరంలోని పురాతన క్లాక్ టవర్ల పునరుద్దరణ రూ. 30 లక్షల వ్యయంతో హుస్సేనియాలం లోని అషుర్ ఖానా పునరుద్దరణ, కోటి 48 లక్షల వ్యయంతో గుల్జారా హౌస్ లోని చార్ కమాన్ల పరిరక్షణ పనులు, రూ. 5.97 కోట్ల వ్యయంతో పత్తర్ గట్టీ స్టోన్ ఆర్కేడ్ పనుల పునరుద్దరణ, రూ. 36 కోట్ల వ్యయంతో లాడ్ బజార్ లోని ముర్గీచౌక్ పునర్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

మోజంజాహిమార్కెట్ పునరుద్దరణ: చారిత్రాత్మక మోజంజాహి మార్కెట్ పునరుద్దరణ పనులను రూ. 15 కోట్ల వ్యయంతో జిహెచ్ఎంసి చేపట్టింది. దీనిలో భాగంగా మార్కెట్ ప్రధాన భవనం, మీట్ మార్కెట్ ల పునరుద్దరణ, మార్కెట్ చుట్టూ ఫుట్ పాత్ నిర్మాణం, టాయిలెట్ల బ్లాక్ ల పునరుద్దరణ, విద్యుత్ లైన్ల ఏర్పాట్లను చేపట్టారు.

పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం: బహిరంగ మలమూత్ర విసర్జన లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రస్తుతం ఉన్న టాయిలెట్లకు అదనంగా కొత్తగా 8,400 సీటింగ్ ఉండేవిధంగా 4,225 టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే నగరంలో ఉన్న 316 పెట్రోల్ బంక్ లలో టాయిలెట్లు, అన్ని ప్రధాన హోటళ్లలోని టాయిలెట్లను ప్రజలు ఉపయోగించుకునేందుకు జిహెచ్ఎంసి వెసులుబాటు కలిగించింది. ఇప్పటికే నగరంలో 210 బి.ఓ.టి టాయిలెట్లు, 113 ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు, 48 షీ టాయిలెట్లు, 16 మెట్రో టాయిలెట్లు, 10 లూ-కేఫే టాయిలెట్లు ఉన్నాయి. వీటికితోడు జోన్ కు ఐదు చొప్పున 30 మొబైల్ బస్ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేశారు.

చెత్త తరలింపుకు ఆధునిక వాహనాలు: నగరంలో ప్రస్తుతం ఉన్న ట్రాఫర్ స్టేషన్ల స్థానంలో ఆధునిక పద్దతిలో 60 సెంకడరి కలెక్షన్, ట్రాన్స్ పోర్ట్ పాయింట్లను (ఎస్.సి.టి.పి) లను ఏర్పాటు చేయాలని జిహెచ్ఎంసి ప్రణాళిక రూపొందించింది. ఈ కేంద్రాల నుండి మున్సిపల్ వ్యర్థాలను తరలించేందుకు 35 జి.వి.డబ్ల్యూ సామర్థ్యం గల 55 బెంజ్ వాహనాలను, 61 పోర్టబుల్ సెల్ఫ్ కంప్యాక్టర్లు, 16 హై కెపాసిటి ఆటోమెటెడ్ స్టాటిక్ కంప్యాక్టర్లు, 65 హై కెపాసిటి సీల్డ్ కంటైనర్లను జిహెచ్ఎంసి సమకూర్చుకుంది.

శానిటేషన్ వర్కర్ల వేతనాల పెంపు: గ్రేటర్ హైదరాబాద్ లోని శానిటేషన్ వర్కర్ల వేతనాలను రూ. 14,500 నుండి రూ. 17,500 లకు పెంచడం జరిగింది. దీంతో 18,550 శానిటేషన్ వర్కర్లు, 948 ఎస్.ఎఫ్.ఏ లు, ఎంటమాలజి వర్కర్లకు లబ్ది చేకూరింది.

హరితహారం: గ్రేటర్ హైదరాబాద్ లో పచ్చదనాన్ని పెంపొందించడం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు, ఉష్ణోగ్రతలు, పొల్యూషన్ తగ్గింపుకై చేపట్టిన తెలంగాణ కు హరితహారంలో భాగంగా ఇప్పటి వరకు 2,76,97,967 మొక్కలను నాటడం, పంపిణీ చేయడం జరిగింది. 2016 నుండి 2020 వరకు 3 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 86.28 శాతం మొక్కలు పంపిణీ, నాటడం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండున్నర కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 2.08 కోట్ల మొక్కలను పంపిణీ, నాటడం జరిగింది. నగరంలోని 65 ప్రాంతాల్లో యాదాద్రి మోడల్ మియావాకి ప్లాంటేషన్ ను చేపట్టారు. 19 మేజర్ పార్కులు, 17 థీమ్ పార్కులు, 919 కాలనీ పార్కులు, 105 సెంట్రల్ మీడియన్ లు, 66 ట్రాఫిక్ ఐ-లాండ్ లు, 18 ఫ్లైఓవర్లు, 327 ట్రీ ఫార్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

18 స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల నిర్మాణం: హైదరాబాద్ లో క్రీడాకారులను ప్రోత్సహించేలా వారికి కావాల్సిన సౌకర్యాల కల్పనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, ఇండోర్ స్టేడియం లు, ప్లేగ్రౌండ్ ల నిర్మాణం రూ. 89.53 కోట్ల వ్యయంతో జిహెచ్ఎంసి పెద్ద ఎత్తున చేపట్టింది. వీటిలో ఇప్పటికే 7 స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల నిర్మాణం పూర్తి కాగా, మిగిలిన 11 స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు వివిధ దశలో ఉన్నాయి.

బస్తీ దవఖానా: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు బస్తీ దవఖానాలను ప్రారంభించారు. 2018 లో ప్రారంభమైన ఈ బస్తీ దవఖానాలు ప్రస్తుతం 225 కు పైగా పనిచేస్తున్నాయి. ప్రతి బస్తీ దవఖానాలో సుమారు 80 నుండి 90 మంది ప్రాథమిక చికిత్సకై వస్తున్నారు. ఈ బస్తీ దవఖానలో ఓ.పి సౌకర్యం, టెలీ కన్సల్టేషన్, మౌలిక ల్యాబ్ పరిక్షలు, ఉచిత మందుల సరఫరా, ఇమ్యునైజేషన్ తదితర వైద్య సదుపాయాలను అందిస్తున్నారు.

అన్నపూర్ణ – ఐదు రూపాయల భోజనం: ఏ ఒక్కరూ కూడా ఆకలితో అలమటించవద్దని ముఖ్యమంత్రి సంకల్పంతో గ్రేటర్ హైదరాబాద్ లో ప్రారంభించిన ఐదు రూపాయల భోజన పథకం – అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ప్రతి రోజు 35 వేల మందికి భోజనాలు అందజేస్తున్నారు. లాక్ డౌన్ సందర్భంగా 373 కేంద్రాలు 259 మొబైల్ కేంద్రాల ద్వారా ఉచితంగా భోజనాన్ని అందజేశారు. 2020 -21 ఆర్థిక సంవత్సరంలో 1,76,14,332 మందికి ఐదు రూపాయల భోజనాన్ని అందజేశారు.

నైట్ షెల్టర్లు: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పలు పనుల నిమిత్తం హైదరాబాద్ కు వచ్చేవారు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 17 నైట్ షెల్టర్లను నిర్వహిస్తున్నారు. అన్ని నైట్ షెల్టర్లలో ప్రతి రోజు 650 మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు.

యు.సి.డి విభాగం: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 45,629 స్వయం సహాయక బృందాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 85 కోట్ల రుణాలను అందించారు. స్వయం ఉపాది కల్పన కార్యక్రమంలో భాగంగా రూ. 4.23 కోట్ల వ్యయంతో 596 మందికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించారు. నగరంలో 1,45,090 వీధి వ్యాపారులకు సర్వే చేసి వీరికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీచేయడంతో పాటు 30కి పైగా టౌన్ వెండింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం 1,655 మందికి ఆసరా గుర్తింపు కార్డులు జారీచేశారు. 2015 మంది దివ్యాంగులకు వికాసం కార్డులను అందజేశారు. దివ్యాంగులకు చెందిన ఆరు స్వయం సహాయక బృందాలను కొత్తగా ఏర్పాటు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 45 గ్రూపులకు రూ. 8.44 కోట్ల రుణాలను అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here