మంత్రి కేటీఆర్ జనవరి 4న వరంగల్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు . దీనికి సంబంధించి
ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలు జారీచేశారు .ఈ నెల 30వ తేదీన పర్యటనకు సంబంధించి మరో సమీక్ష, సమావేశం చేయాలనీ నిర్ణయించారు .

జనవరి 4వ తేదీన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు వరంగల్ పర్యటించనున్నారు . ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా కార్పొరేషన్ లోని పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పనులపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ లోని తన క్యాంపు కార్యాలయం అర్ అండ్ బి అతిథి గృహంలో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి సమీక్షించారు. ఆయా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏయే పనులు ఎలా చేయాలనే దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆ రూ రీ రమేశ్, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, GWMC కమిషనర్ పమేలా సత్పతీ, GWMC అధికారులతో కలిసి ఆయా పనులను సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ లో మంత్రి కెటిఆర్ తో జరిపిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, ఆయా పనుల ప్రగతి తీరుని అధికారులతో చర్చించారు. ఉగాది నుంచి వరంగల్ లో ప్రతి ఇంటింటికీ మంచినీటిని ప్రతి రోజూ ఇవ్వాలన్న నిర్ణయంలో భాగంగా 45వేల కొత్త కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికే ఇచ్చిన కనెక్షన్లు పోను ఇంకా, 24వేల కొత్త కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. వాటికి సరపడా మెన్, మెటీరియల్, ఇతరత్రా మౌలిక అవసరాలన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు. అయితే, స్లం ఏరియాల్లో తప్పనిసరిగా కనెక్షన్లు అందేలా చూడాలన్నారు. రూ.1 కే కనెక్షన్ కింద ప్రతి ఇంటింటికీ నల్లా కనెక్షన్లు, మంచినీరు అందించే విధంగా పైపు లైన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. మంచినీటి సరఫరా కోసం ఆర్ డబ్ల్యుఎస్ లేదా మిషన్ భగీరథ ల నుంచి ఉద్యోగులను డిప్యూట్ చేసుకోవాలని సూచించారు. నగరంలో ఇటీవలి వరదలకు కొట్టుకుపోయిన, చెడిపోయిన రోడ్ల మరమ్మతుల కోసం ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో భాగంగా పంచాయతీరాజ్, ఐటీడిఎ శాఖల ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లను డిప్యూట్ చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అమృత్ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.150 కోట్లు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల నిధుల కింద ఇప్పటి వరకు రూ.170 కోట్లను మనమే వ్యయం చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే, ఒక్క మిషన్ భగీరథ పథకం కిందే గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థలో ఇప్పటి వరకు 1000 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. దేశంలో ఏ నగరానికి లేని విధంగా మంచినీటిని వరంగల్ కి అందచేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి వివరించారు. అలాగే మున్సిపాలిటీలోని అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువలు, పారిశుద్ధ్యం, పార్కులు, ప్రణాళికా బద్ధంగా నగర నిర్మాణం, భవిష్యత్ ప్రణాళికలు, భవిష్యత్తులో చేపట్టబోయే పనులు, సత్వరమే పూర్తి చేయాల్సిన పలు పనులపైనా మంత్రి వివరంగా అధికారులతో చర్చించారు.
మంత్రి కేటీఆర్ జనవరి 4న రాక సందర్భంగా….
జనవరి 4వ తేదీన మంత్రి కెటిఆర్ రాక సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి జిల్లా కలెక్టర్, వరంగల్ నరక కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతిలను ఆదేశించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు ప్రారంభోత్సవాలు, నిరుపేదలకు పట్టాల పంపిణీ, వైకుంఠ ధామాలకు శంకుస్థాపన, నాలాలు, నగరంలో రోడ్ల మరమ్మతులకు శంకుస్థాపనలు, కొత్త పార్కుల ప్రారంభం, వరంగల్ రైల్వే ఓవర్ బ్రిడ్జికి ప్రారంభోత్సవం, నైట్ షెల్టర్లకు శంకుస్థాపనలు వంటి పలు అంశాలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులకు సూచించారు. పలు చోట్ల స్థలాలను గుర్తించి ఆదర్శవంతంగా ఉండే విధంగా వైకుంఠ ధామాలు, పార్కులు, ఇతర నిర్మాణాలు చేపట్టాలని కూడా మంత్రి అధికారులకు తెలిపారు.
జీహెచ్ఎంసి అభివృద్ధి 2020 లో చేసిన పనులు- Report
ఈ నెల 30వ తేదీన మరో సమీక్ష-
ఆయా పనుల గుర్తింపుతోపాటు, ఆయా పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు రూట్ మ్యాప్ రెడీ చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. రూట్ మ్యాప్ గురించి, ఆయా అభివృద్ధి పనుల తీరు తెన్నుల గురించి ఈ నెల 30వ తేదీన మరోసారి సమావేశమై సమీక్షించాలని మంత్రి ఎర్రబెల్లి నిర్ణయించారు. ఆ రోజున మంత్రి సత్యవతి రాథోడ్ తోపాటు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు హాజరయ్యే విధంగా చూడాలని మంత్రి ఎర్రబెల్లి సంబంధిత అధికారులను ఆదేశించారు.