వైయస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ మూడో విడత చెల్లింపు, నివర్ తుపాన్ నష్టంపై ఇన్పుట్ సబ్సిడీ క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోనేరుగా దాదాపు రూ.1766 కోట్లు వేసిన సీఎం శ్రీ వైయస్ జగన్.

సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ ఇవాళ మరో శుభ కార్యానికి శ్రీకారం చుడుతున్నాం. రైతుల ఖాతాల్లోకి మరో రూ.1766 కోట్లు జమ చేస్తున్నాం. అందులో మూడో విడత రైతు భరోసా కింద అర కోటికి పైగా రైతుల ఖాతాల్లో రూ.1120 కోట్లు, నివర్ తుపానుతో నష్టపోయిన 8.34 లక్షల రైతులకు (ఒక సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో) నెల రోజుల లోపే పరిహారం అందిస్తూ, దాదాపు రూ.646 కోట్లు జమ చేస్తున్నాం. ఈ రెండూ కలిపి దాదాపు రూ.1766 కోట్లు ఇవాళ రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం’.
నమ్మాం కాబట్టే:
‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం మనది. అందుకే మొట్టమొదటి రోజు నుంచి రైతు పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పడమే కాకుండా ప్రతి అడుగు కూడా రైతు పక్షపాతంగా ముందుకు వేయడం జరిగింది’.
గత ప్రభుత్వ హయాంలో:
‘గత టీడీపీ ప్రభుత్వం రైతుల రుణాలు రూ.87,612 కోట్లు మాఫీ చేస్తామని ప్రకటించి, ఆ 5 ఏళ్లలో విడతలుగా కనీసం రూ.12 వేల కోట్లు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ అధికారులు తెలిపారు. ధాన్యం, విత్తనాలు, ఇన్సూరెన్సు, కరెంటు బకాయిలతో పాటు, చివరకు ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ బకాయిలు కూడా ఎగ్గొట్టారు. వారు రైతులకు చేసిన మోసం అంతా ఇంతా కాదు. ఇది అందరికీ తెలుసు’.
‘చివరకు బాధలు పడలేక ఆత్మహత్య చేసుకున్న 434 రైతుల కుటుంబాలకు మన ప్రభుత్వం వచ్చాక పరిహారం ఇవ్వడం జరిగింది.
గత ప్రభుత్వం ఏ రకంగా రైతుల పట్ల దారుణంగా వ్యవహరించిందో చూశాం’.
ఈ 18 నెలల కాలంలో:
‘అదే మన ప్రభుత్వం గత 18 నెలలుగా రైతుల కోసం ఏమేం చేసిందో చెస్పాలి.
వైయస్సార్ రైతు భరోసా:
‘వైయస్సార్ రైతు భరోసా కింద 51.59 లక్షల రైతుల కుటుంబాలకు రూ.13,101 కోట్లు ఇవ్వడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా, రైతులకు పెట్టుబడి సాయంగా రూ.13,500 ఇవ్వడమే కాకుండా, కౌలు రైతులు, అటవీ భూములు, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది’.
సున్నా వడ్డీ:
‘గత ప్రభుత్వం సున్నా వడ్డీ బకాయిలు రూ.904 కోట్లు పెట్టిపోతే, ఆ బకాయిలు తీర్చడమే కాకుండా, వైయస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఈ ఖరీఫ్‌లో పంట రుణాలకు సంబంధించి రూ.510 కోట్లు చెల్లించడం జరిగింది’.
ఉచిత పంటల బీమా:
‘వైయస్సార్ ఉచిత పంటల బీమా క్లెయిమ్‌ల కోసం రూ.1968 కోట్లు చెల్లించడం జరిగింది. రైతుల నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాం’.
ఇన్పుట్ సబ్సిడీ:
‘ఈ ఏడాది జూన్ నుంచి నవంబరు వరకు భారీ వర్షాలు, వరదలు, తుపానుల వల్ల 17.25 లక్షల ఎకరాల్లో జరిగిన పంట నష్టానికి గానూ, 13.56 లక్షల రైతులకు సుమారు రూ.1038.46 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించడం జరిగింది’.
పంటల కొనుగోలు:
‘సరైన ధరలు రైతులకు కచ్చితంగా రావాలన్న తపన, తాపత్రయంతో ధాన్యం కొనుగోలుకు రూ.18,343 కోట్లు వెచ్చిస్తే, ఇతర పంటల కోసం మరో రూ.4,761 కోట్లు వ్యయం చేయడం జరిగింది. కేవలం రైతులకు మంచి ధర రావాలన్న ఒకే ఒక దృక్పథంలో ఈ వ్యయం చేశాం’.
వ్యవసాయం–విద్యుత్:
‘రైతుల కోసం ఇస్తున్న ఉచిత విద్యుత్ కోసం, ఆక్వా రైతుల బాగు కోసం రూ.17,430 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో గత ప్రభుత్వం రైతుల తరపున కట్టాల్సిన రూ.8,655 కోట్ల బకాయిలు కూడా మన ప్రభుత్వమే తీర్చిందని తెలియజేస్తున్నాను. రైతులకు పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం ఫీడర్ల కెపాసిటీ పెంచేందుకు రూ.1700 కోట్లు వెచ్చించాం. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను శాశ్వత ప్రాతిపదికన ఇవ్వడానికి 10 వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు టెండర్లను కూడా పిలిచాం’.
బకాయల చెల్లింపు:
‘గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం సేకరణ బకాయిలు కూడా రూ.960 కోట్లు చెల్లించాం. విత్తనాల సబ్సిడీ కింద గత ప్రభుత్వ ఎగ్గొట్టిన రూ.384 కోట్లు కూడా రైతుల కోసం మన ప్రభుత్వం చిరునవ్వుతో చెల్లించడం జరిగింది. శనగ రైతులకు బోసన్గా రూ.300 కోట్లు అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించాం’.
రూ.61,400 కోట్లు:
‘మొత్తంగా రైతుల కోసం ఈ 18 నెలల కాలంలో రూ.61,400 కోట్లు చిరునవ్వుతోనే వెచ్చించామని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడుతున్నాను.’
గ్రామాల్లో వికాసం:
‘మన గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం:
విత్తనం నుంచి పంటల అమ్మకం వరకూ రైతుకు తోడుగా ఉంటున్నాం:
గ్రామాల్లోనే గోదాములు, ప్రైమరీప్రాససింగ్ సెంటర్లు, నియోజకవర్గాల స్థాయిలో సెకండరీ ప్రాససింగ్ యూనిట్లు, గ్రామాల్లో జనతా బజార్లు కూడా ఈ సంవత్సర కాలంలో చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు అండదండలు అందించడానికి వేల కోట్లు ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు. పైన చెప్పిన వాటి కోసం దాదాపు రూ.10 వేలకోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రణాళికా బద్ధంగా దీని కోసం అడుగులు ముందుకేస్తున్నాం’.
మమకారం, ప్రేమ:
‘రైతుల మీద మమకారంతో, ప్రేమతో, బాధ్యతతో ఇవన్నీ చేస్తున్నాం. ఇంతగా రైతన్నల కోసం మేం చాలా నిజాయితీ, చిత్తశుద్ధితో ఏ ఒక్క పొరపాటుకు ఆస్కారం లేకుండా పని చేస్తున్నాం’.
బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు:
‘కానీ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే.. ‘పండ్లు ఇచ్చే చెట్టు మీద రాళ్లు పడతాయి’ అన్నట్లుగా, బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు డ్రామాలు ఆడిస్తున్నాడో మనమంతా చూస్తున్నాం’.
ఇప్పటికే 6 పర్యాయాలు చెప్పాం:
‘రైతు భరోసా, నివర్ తుపాను బాధిత రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఇవాళ ఇస్తామని గతంలోనే చెప్పాం. ఇది ఇవాళ కొత్తగా చెప్పిన మాట కాదు. ఇదే మాట ఆరు సందర్భాల్లో చెప్పాం’.
‘నవంబర్ 24న వీడియో కాన్ఫరెన్స్‌లో, నవంబర్ 25న సీఎంఓ మీటింగులో చెప్పాం, నవంబర్ 27న కేబినెట్ మీటింగులో చెప్పాం, నవంబర్ 28న నివర్ తుపానుపై తిరుపతిలో జరిగిన రివ్యూ మీటింగులో చెప్పాం, నవంబర్ 30న అసెంబ్లీలో చెప్పాం. ఆ తర్వాత డిసెంబర్ 18న కేబినెట్ సమావేశంలో కూడా చెప్పాం’.
‘గతంలో ఈనెల 31వ తేదీలోగా ఇస్తామని చెప్పినా, 18వ తేదీన జరిగిన క్యాబినెట్ సమావేశంలో, ఈనెల 29న ఇస్తామని స్పష్టంగా తేదీ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఇస్తామని కొత్తగా చెప్పింది కాదు, గతంలోనే ఇన్నిసార్లు చెప్పాం’.
అయినా వక్రబుద్ధి:
‘జగన్ ఒక తేదీ చెప్తే.. ఆ రోజు చేస్తాడని మీకు తెలుసు. ఇవాళ ఇస్తామని తెలుసు కాబట్టి, ఎలాగూ జరుగుతుంది కాబట్టి.. వెంటనే చంద్రబాబునాయుడు గారు, ప్రతిపక్ష నేత ఆయన చూపుతున్న వక్రబుద్ధి చూస్తుంటే బాధనిపిస్తుంది. ఇవి జరుగుతున్నాయి కాబట్టి, చంద్రబాబునాయుడు గారు జూమ్‌కి దగ్గరగా ఉంటారు.. భూమికి దూరంగా ఉంటారు. వెంటనే మన నాయడు గారు తన పుత్రుడ్ని, దత్తపుత్రుడ్ని ఇద్దర్నీ రంగంలోకి దించుతాడు. ఇద్దరిలో ఏ ఒక్కరి మీదా నమ్మకం లేదు కాబట్టి ఇద్దర్నీ కలిపి రంగంలోకి దించుతాడు. ఇద్దరూ హైదరాబాద్ నుంచి వస్తారు. వీరిద్దరికీ రైతుల కష్టాల గురించి ఏనాడూ పట్టదు. ఏనాడూ రైతుల కష్టాల గురించి నోరు విప్పని వాళ్లు’.
గతంలో జరగనిది:
‘ఇంతకు ముందు రాష్ట్ర చరిత్రలో రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడమే గొప్పగా చెప్పే వాళ్లు. అటువంటిది రంగు మారిన ధాన్యం అయినా సరే, తడిసిన ధాన్యం అయినా సరే, చివరకు చివరకు మొలకెత్తిన ధాన్యం అయినా సరే, అదే పనిగా కొత్త పద్ధతులతో కొనుగోలు చేసే కార్యక్రమం చేశాం. ఇప్పటికే రంగు మారిన, తడిసిన, మొలకలెత్తిన ధాన్యం 73 వేల టన్నులు కొనుగోలు చేసిన పరిస్థితి. ఇది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు’.
80 శాతం సబ్సిడీతో విత్తనాలు:
‘నష్టపోయిన రైతులకు రెండో పంటకు 80 శాతం సబ్సిడీతో ఇప్పటికే 43 వేల క్వింటాళ్ల విత్తనాలు కూడా పంపిణీ చేయడం జరిగింది’.
ఎవరికీ నష్టం కలగకుండా:
‘నివర్ తుపాను వచ్చిన నెలలోపే రైతులకు నష్టం జరక్కుండా ఈ క్రాప్ డేటా ద్వారా, గ్రామ సచివాలయాల్లో పారదర్శకంగా జాబితాలు పెట్టి, సామాజిక ఆడిట్ చేసి ఎవ్వరికీ నష్టం జరక్కుండా పరిహారం చెల్లిస్తున్నాం. దీంతో పాటు రైతు భరోసా మూడో విడత సొమ్మును కూడా ముందుగానే ఇవాళ అందిస్తున్నాం. ఇవి గతంలో ఏనాడూ జరగని విధంగా జరుగుతున్నాయని తెలిసినా కూడా, వక్ర బుద్ధితో వీరు విమర్శలు చేస్తున్నారు. ఇది బాధ అనిపిస్తోంది’.
సంతోషంగా సంక్రాంతి:
‘ఇళ్ల పట్టాలు అందుకుని అక్కచెల్లెమ్మలు సంతోషంతో ఉన్నారు: గ్రామాల్లో సంక్రాంతి కళ కనిపిస్తోంది. అందరూ సంతోషంతో సంక్రాంతి జరుపుకోవాలని, ఇప్పుడు ఈ సంతోషంలో రైతన్నలు భాగస్వామ్యం కావాలని ఇవాళ రైతు భరోసా, నివర్ తుపాను నష్ట పరిహారాన్ని అందిస్తున్నాం’.
చివరగా..
‘ఇలా మంచి చేసే మీ అందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వానికి అందరి చల్లని దీవెనులు ఉండాలని, మీకు ఇంకా మంచి చేయాలని మనసారా కోరుకుంటున్నాను’ అంటూ సీఎం శ్రీ వైయస్ జగన్ తన ప్రసంగం ముగించారు. ఆ తర్వాత కంప్యూటర్లో బటన్ నొక్కి, రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు.
మంత్రి కేటీఆర్ జనవరి 4న వరంగల్ పర్యటన విశేషాలు
కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి:
– ‘సీఎం గారు చరిత్ర సృష్టించారు. గతంలో పంట నష్టం జరిగితే ఎప్పుడు అంచనా వేసేవారో తెలియదు. పరిహారం ఎప్పుడిస్తారో అంతకన్నా తెలియదు. కానీ మీరు చెప్పిన మాట ప్రకారం అన్నీ అమలు చేస్తున్నారు. పంట నష్టం జరిగితే నెల రోజుల్లోనే సహాయం చేస్తున్నారు. చెప్పిన తేదీ కంటే ముందే ఇస్తున్నారు. పాదయాత్రలో చెప్పిన ప్రతి ఒక్కటి ఇప్పుడు తూచ తప్పకుండా అమలు చేస్తున్నారు. చివరకు నివర్ తుపానుతో నష్టపోయిన రైతులకు కూడా నెల రోజలు వ్యవధిలోనే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు. ఇక రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పొందిన రైతులకు కూడా ఇస్తున్నారు. రైతుల కోసం మీరు చేస్తున్న అన్నింటికీ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’.
వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, ఎంపీ బాలశౌరి, సీఎస్ నీలం సాహ్ని, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ కమిషనర్ కన్నబాబు, మార్కెటింగ్ స్పెషల్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, ఏపీ అగ్రి మిషన్ వైస్ ఛైర్మన్ ఎమ్వీఎస్ నాగిరెడ్డితో పాటు, పలువురు అధికారులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, వివిధ జిల్లాల నుంచి అధికారులు, రైతులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు